పదమున్భాసిలు నర్థమున్నిలుపగా, ప్రాశస్తమౌ విద్యతో,
చదువున్మిన్నగ నెంచి,నిన్గొలుచు సత్సంగమ్మునన్, శారదే!
మది నీ రూపము నిల్పి వందనములంబల్కంగ, ప్రేమమ్ముతో
సదసద్భేదము తెల్పి, సార్థకముగా జన్మంబు సేయంగదే!
22, జనవరి 2026, గురువారం
శ్రీపంచమి
21, జనవరి 2026, బుధవారం
దీపం
-- లక్ష్మీదేవి
ఆటవెలది
1, జనవరి 2026, గురువారం
తల్లీ!
30, డిసెంబర్ 2025, మంగళవారం
నాథా!
29, డిసెంబర్ 2025, సోమవారం
హ్మ్ హ్మ్
18, నవంబర్ 2025, మంగళవారం
కాలం!
నీలపు రాత్రులంబొదిగి స్నిగ్ధసువర్ణ దినాళులందు ను
న్మీలిత నేత్ర! నిభ్భువిని మేలిమి యన్నులమిన్నఁ జేసి, మ
మ్మేలితి! చిత్రమేమనగ హృద్యమ ప్రాకృత దృశ్యవీక్షణా
లాలసఁగోలుపోయినది లౌకికజీవనమేమి కాలమో!
2, అక్టోబర్ 2025, గురువారం
విజయదశమి
జీవనమునఁ గలిమియు బలిమియునిడి సేమములనుఁ గరుణనొసగు నీ
పావనమగు నిజ ముగమునుఁ గనఁగల భాగ్యములను నడిగెద, మది నీ
కోవెలవలె నిలుపగఁ దగు గుణములఁ గోరెద, జగములు నిరతము నీ
దీవనలను సుఖముగ మనఁగలుగుట దీక్షనుఁ గొని నడిగెద హిమజా!
వెన్నెల లలిగా పేరుచు, రే జిప్పిలు నిరులనుఁ జూపెడి వెలుగులలో
పున్నెపు సిరిగా నేలిన దైవమ్మును శరణని, శేముషి నిడుమని నే
విన్నపమిడగా దీవనగా దిగ్విజయ పథముఁ బంపెడి జననివి, ని
న్నెన్నడు విధిగాఁ గొల్చెదనమ్మా! యినుమడిగను రేయిని పగళులలో.
30, సెప్టెంబర్ 2025, మంగళవారం
లక్ష్మీ
సిరులనునివ్వంగల దేవీ! చిరుచిరునగవుల సిరులీవే!
మురిపెముతోఁగోరెద, నీ పావన ముఖదరిసెనములనిమ్మా!
తరుణిని నన్నీ భువినిన్వీడక, తప జపములఁ గొనరావే!
వరముల నేఁ గోరను, లక్ష్మీ! ననుఁ బదములకడ నిలుపమ్మా!
-- లక్ష్మీదేవి
లక్ష్మీ వృత్తము
29, సెప్టెంబర్ 2025, సోమవారం
స్రక్
కొలువై నీవుండుతావున్కొరత కలుగునే కోమలాంగీ! వరాంగీ!
పలుకే తాఁదొల్కుఁ దేనెల్వఱదఁగొనఁగ శర్వాణి! చిచ్ఛ్యామలాంగీ!
తలతున్నిన్నెందు నన్ నీదరినిఁ గొనుము కాదంబినీ! మంగళాంగీ!
చెలిమిన్పాడంగనిమ్మా, చిలుకపలుకులన్శీతపుత్రీ శుభాంగీ !
28, సెప్టెంబర్ 2025, ఆదివారం
వందనము
ఫణమూను సర్పముల వోలె భాసిలగ, భీకరాకృతులతో
రణచండివై కదలి, క్రూర రక్కసుల మత్సరమ్మడచు మా
రణహోమ గాథలనుఁ గూర్చి రంజిలగ, దేవి భాగవతము
న్మణిమాలగా పెనఁచు నాటి మౌనులకు వందనంబనియెదన్.
- లక్ష్మీదేవి
మణిమాల
27, సెప్టెంబర్ 2025, శనివారం
లక్ష్మిదేవి
25, సెప్టెంబర్ 2025, గురువారం
ఆశ తీరదు
తెలుపునఁ దేలు మరాళముపైని సతీ సరస్వతి రూపముం
దలచి యొకింత విశేషపు భంగిఁ బదమ్ముఁ బాడగనెంచితీ
యలసట తక్క కృతార్థత కల్గక యాశతీరదు, శుద్ధమౌ
లలిత పదాళిని ధారనొసంగు విలాసమెన్నడు జూపెదో!
24, సెప్టెంబర్ 2025, బుధవారం
సరస్వతీ!
కంటికి కానరాదెచట, గంధము దాచుట క్లిష్టమౌ, సదా
కంటకఛేదియై యొనరు, గౌరవమెప్పుడు వృద్ధిఁజేయు, తా
వెంటను వచ్చునెన్నటికి, ప్రీతినిఁ బంచిన హెచ్చు, నట్టి సొ
త్తంటి సువిద్యనిత్తువని తల్లి సరస్వతి! నిన్ను చేరుదున్.
-- లక్ష్మీదేవి.
ఉత్పలమాల
సద్యోజాత
తల్లీ! దండములమ్మ ! నవ్యనవనీతంబైన సింగారమై
కల్లోలంబుల పాల సంద్రమున, బంగారంపు పూబంతివై
యుల్లాసమ్ముగ నేల గర్భమున, సద్యోజాత సన్మూర్తివై
ఫుల్లాబ్జాక్షి జనించి, శ్రీహరిని సమ్మోహించి చేబట్టితే!
22, సెప్టెంబర్ 2025, సోమవారం
పెంజీకటి
పరిచయమైన రూపు, పసిపాపనుఁ బోలిన నవ్వు, చల్లనై
విరిసిన కంటిచూపు, కడు భీతినిఁ బారగఁ ద్రోలు శౌర్యముం,
దరగని కాంతితోపు ముఖదర్శనమెల్లను వీడి, జ్ఞానియై
చిరు దరహాస ముద్రఁ బెనుఁ జీకటికవ్వలి కాంతిఁ దల్చుటో!!
18, సెప్టెంబర్ 2025, గురువారం
దిక్కెవ్వరో!
మోహావేశముతో భ్రమించి జగతిన్మూర్ఖమ్ముగా నమ్ముచున్
బాహాటమ్ముగ నేఱరానివగు దుర్వారంపు లోకుట్రలన్
దేహాత్మల్ బలియైన వేళ నకటా! దిక్కెవ్వరో స్వామి! నీ
సాహాయ్యమ్మునుఁ గాక నాకు, కలదా సందేహమింతైననున్.
-లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
15, సెప్టెంబర్ 2025, సోమవారం
ద్వ్యా
- లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
ద్వ్యా ప్రాస
27, ఆగస్టు 2025, బుధవారం
వినాయకా
ఏనుగుమోమునేర్పడగ నిమ్మడి శోభల మూర్తి పూజకై
జానుతెనుంగు పద్యములఁ జక్కగఁ బాడు నొకింత నేర్పుకై
యేను వినమ్రతన్నిలుతు నియ్యెడ స్వామి వినాయకా! వెస
న్కానుకఁ, గోరు చందమున కైగొన నిచ్చి యనుగ్రహింపుమా!
-లక్ష్మీదేవి
ఉత్పలమాల