Loading...
జగజ్జనని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జగజ్జనని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

కన్యాకుమారి

 తరుణీ, కాఠిన్యవై నిత్యముఁ దపమునఁ దాదాత్మ్యవై నిల్చి యుండ,
న్సరి నీకెవ్వారు లేరంచనిన కథలలో సత్యముల్ గొప్పవమ్మా!
హరునేఁ గళ్యాణమున్ సేయగఁ దలచిన మాహాత్మ్యమేమందు, నీకై
వరుడున్ ధ్యానమ్ము నన్నిల్వగఁ దలచిన సౌభాగ్యమేమందు తల్లీ! 


🙏 కన్యాకుమారి 🙏


- లక్ష్మీదేవి.
మహాస్రగ్ధర వృత్తము


23, జనవరి 2026, శుక్రవారం

తల్లీ!

 తల్లీ! విద్యనొసంగి యధ్యయనమున్తాదాత్మ్యమున్నిండుగా
నుల్లమ్మందున నింపి నన్ను నిక నీవుద్ధారణన్జేయుమా!
ముల్లోకమ్ముల రక్షవై నిలిచి నిర్మోహమ్ము నెట్లుందువో
తల్లీ! నమ్మితి భారతీ! భగవతీ! త్రైగుణ్య విద్యానిధీ!

 

లక్ష్మీదేవి
శార్దూలవిక్రీడితము
 

22, జనవరి 2026, గురువారం

శ్రీపంచమి

పదమున్భాసిలు నర్థమున్నిలుపగా, ప్రాశస్తమౌ విద్యతో,
చదువున్మిన్నగ నెంచి,నిన్గొలుచు సత్సంగమ్మునన్, శారదే!
మది నీ రూపము నిల్పి వందనములంబల్కంగ, ప్రేమమ్ముతో
సదసద్భేదము తెల్పి, సార్థకముగా జన్మంబు సేయంగదే!

- లక్ష్మీదేవి
మత్తేభవిక్రీడితము


21, జనవరి 2026, బుధవారం

దీపం

 గాలి తగిలినంత ఘడియ నిలువలేదు
దేహధారి యుంచు దీపమొకటి
గాలి తగులకున్న ఘడియ నిలువలేదు
దేవుడుంచినట్టి దీపమొకటి
/(దేహమందు వెలుగు దీపమొకటి)


-- లక్ష్మీదేవి

ఆటవెలది



2, అక్టోబర్ 2025, గురువారం

విజయదశమి

జీవనమునఁ గలిమియు బలిమియునిడి సేమములనుఁ గరుణనొసగు నీ
పావనమగు నిజ ముగమునుఁ గనఁగల భాగ్యములను నడిగెద, మది నీ
కోవెలవలె నిలుపగఁ దగు గుణములఁ గోరెద, జగములు నిరతము నీ
దీవనలను సుఖముగ మనఁగలుగుట దీక్షనుఁ గొని నడిగెద హిమజా!  

వెన్నెల లలిగా పేరుచు, రే జిప్పిలు నిరులనుఁ జూపెడి వెలుగులలో
పున్నెపు సిరిగా నేలిన దైవమ్మును శరణని, శేముషి నిడుమని నే
విన్నపమిడగా దీవనగా దిగ్విజయ పథముఁ బంపెడి జననివి, ని
న్నెన్నడు విధిగాఁ గొల్చెదనమ్మా! యినుమడిగను రేయిని పగళులలో.

- లక్ష్మీదేవి
లాక్షణీ వృత్తము
విజయ వృత్తము 


30, సెప్టెంబర్ 2025, మంగళవారం

లక్ష్మీ

 సిరులనునివ్వంగల దేవీ! చిరుచిరునగవుల సిరులీవే!
మురిపెముతోఁగోరెద, నీ పావన ముఖదరిసెనములనిమ్మా!
తరుణిని నన్నీ భువినిన్వీడక, తప జపములఁ గొనరావే!
వరముల నేఁ గోరను, లక్ష్మీ! ననుఁ బదములకడ  నిలుపమ్మా!

 

-- లక్ష్మీదేవి

లక్ష్మీ వృత్తము

 

29, సెప్టెంబర్ 2025, సోమవారం

స్రక్

 కొలువై నీవుండుతావున్కొరత కలుగునే కోమలాంగీ! వరాంగీ!
పలుకే తాఁదొల్కుఁ దేనెల్వఱదఁగొనఁగ శర్వాణి! చిచ్ఛ్యామలాంగీ!
తలతున్నిన్నెందు నన్ నీదరినిఁ గొనుము కాదంబినీ! మంగళాంగీ!
చెలిమిన్పాడంగనిమ్మా, చిలుకపలుకులన్శీతపుత్రీ శుభాంగీ !

 

-- లక్ష్మీదేవి
మహాస్రగ్ధర
 

జ్ఞాన

 అమ్మా! చదువుల తల్లివి, యక్షరమిడుమమ్మా!

మమ్మాదరమునఁ జేరిచి మక్కువఁ గనుమమ్మా!

యిమ్మా వినయము, గర్వము నీఁగగ విడుమమ్మా!

యిమ్మానసమను పద్మము నింపుగఁ గొనుమమ్మా!


- లక్ష్మీదేవి

జ్ఞాన వృత్తము


28, సెప్టెంబర్ 2025, ఆదివారం

వందనము

 ఫణమూను సర్పముల వోలె భాసిలగ, భీకరాకృతులతో
రణచండివై కదలి, క్రూర రక్కసుల మత్సరమ్మడచు మా
రణహోమ గాథలనుఁ గూర్చి రంజిలగ, దేవి భాగవతము
న్మణిమాలగా పెనఁచు నాటి మౌనులకు వందనంబనియెదన్.

 

- లక్ష్మీదేవి

మణిమాల 

27, సెప్టెంబర్ 2025, శనివారం

లక్ష్మిదేవి

 

అనయము పాదసేవలకునంకితమైన సతీమతల్లివై,
ఘనుడగు దైవమైన హరిఁ గట్టిన పత్నివి, లక్ష్మిదేవివై,
ధనములు ధాన్యరాశులును ధాత్రి జనాళికినిచ్చు రాజ్ఞివై,
ననుఁగనుచుందువంచు మది నమ్మితినమ్మ సుధాంశుసోదరీ!
 
ఆకలైన నాశలైన నంతులేని స్వార్థమైన
లోకధర్మమంత నీ విలోకనమ్ముఁ గోరునమ్మ
శోకమెల్ల బాపునట్టి చూపుయొక్కటైన చాలు
మ్రోకరిల్ల రక్షసేసి పూజలందు దైవమీవు
-- లక్ష్మీదేవి
చంపకమాల, చంచల

25, సెప్టెంబర్ 2025, గురువారం

ఆశ తీరదు

 తెలుపునఁ దేలు మరాళముపైని సతీ సరస్వతి రూపముం
దలచి యొకింత విశేషపు భంగిఁ బదమ్ముఁ బాడగనెంచితీ
యలసట తక్క కృతార్థత కల్గక యాశతీరదు, శుద్ధమౌ
లలిత పదాళిని ధారనొసంగు విలాసమెన్నడు జూపెదో!

 

-- లక్ష్మీదేవి.
వనమంజరి 

24, సెప్టెంబర్ 2025, బుధవారం

సరస్వతీ!

 కంటికి కానరాదెచట, గంధము దాచుట క్లిష్టమౌ, సదా
కంటకఛేదియై యొనరు, గౌరవమెప్పుడు వృద్ధిఁజేయు, తా
వెంటను వచ్చునెన్నటికి, ప్రీతినిఁ బంచిన హెచ్చు, నట్టి సొ
త్తంటి సువిద్యనిత్తువని తల్లి సరస్వతి! నిన్ను చేరుదున్.

 

-- లక్ష్మీదేవి.

ఉత్పలమాల 

సద్యోజాత

 తల్లీ! దండములమ్మ ! నవ్యనవనీతంబైన సింగారమై
కల్లోలంబుల పాల సంద్రమున, బంగారంపు పూబంతివై
యుల్లాసమ్ముగ నేల గర్భమున, సద్యోజాత సన్మూర్తివై
ఫుల్లాబ్జాక్షి జనించి, శ్రీహరిని సమ్మోహించి చేబట్టితే!

 

-- లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము
 

22, సెప్టెంబర్ 2025, సోమవారం

మనోజ్ఞ

 కమలమవై విలసిల్లి కాంతుని సేవకై

భ్రమరమువై తపియించి బాధలకోర్చు నీ

సమమెవరే సిరిదేవి, చంద్రుని సోదరీ!

సుమములతో కయిమోడ్తు, జోతలఁగొనుమా!

 

-- లక్ష్మీదేవి.
మనోజ్ఞవృత్తము 

పెంజీకటి

 పరిచయమైన రూపు, పసిపాపనుఁ బోలిన నవ్వు, చల్లనై
విరిసిన కంటిచూపు, కడు భీతినిఁ బారగఁ ద్రోలు శౌర్యముం,
దరగని కాంతితోపు ముఖదర్శనమెల్లను వీడి, జ్ఞానియై
చిరు దరహాస ముద్రఁ బెనుఁ జీకటికవ్వలి కాంతిఁ దల్చుటో!!

 

-- లక్ష్మీదేవి.
ఉత్పలమాల
 

17, ఏప్రిల్ 2023, సోమవారం

ఓహో!

 నిన్నల యాకులు రాలగ
న్నెల లేలే చివుళ్ళు, ల్లవములుగా
చెన్నుగ రేపను రూపము
నున్నవి, చింతల విడువుము నోహో యనుమా.

-- లక్ష్మీదేవి 
కందము 

31, జనవరి 2023, మంగళవారం

పల్లె

 పల్లె పట్టులఁ గొల్వు తీరిన పైరుపంటల బాటలో

చల్లచల్లని గాలియుయ్యెల సద్దుఁజేయుచునుండగా

పొల్లుమాటల నవ్వులందునఁ బుణ్యకాలపు బాల్యమై

చెల్లిపోయెను సంబరమ్ములు జీవనమ్మున భాగమై


--లక్ష్మీదేవి.

మత్తకోకిల


17, నవంబర్ 2022, గురువారం

నిస్తారము

 విస్తారంగా పలుకుపదమౌ వేదముం కావ్యమెల్లా
స్తూరిశ్రీ తిలకధరుడా కంజనేత్రుండె గాడో!
నిస్తారమ్మౌ పథమునరుగన్నిబ్బరమ్మెట్టులైనన్
న్యస్తమ్మట్లీ మనమునిడగా నాథుడెట్లైన రాడో!

-లక్ష్మీదేవి 
మందాక్రాంతము 

3, అక్టోబర్ 2022, సోమవారం

ఏదో

 భువిలో జీవించు జీవమ్ము బ్రదుకు భృతికై పోరు సల్పంగ తోడై,

లావణ్యంపు రూపా పలుకు కథలన్, నావగా నమ్ముకుంటిన్.
లేశమ్మైన, నన్, నీ లితమయిన లీలాకథాసారమియ్యీ
సంసారంపు సంరంముల మునుకలన్, వ్యమౌ రీతి గాచెన్.


-లక్ష్మీదేవి 
మహాస్రగ్ధరా 

1, అక్టోబర్ 2022, శనివారం

ధన్యాస్మి

 ముల్లోకములను కారుణ్యముఁగను మూకాంబ ప్రణతులమ్మా!

యుల్లమ్ము నిలిపి, బాల్యమ్ము మొదలు యూహించి కొలుచు నాలో, 

నుల్లాసమమర, దీవింప బ్రదుకు నుప్పొంగు కడలి కాగా, 

తల్లీల మురిసి పద్యానఁదలచి ధన్యాస్మి యనుచు నుందున్.


-- లక్ష్మీదేవి 

చిత్రత్వరితా.